రాజమండ్రిలో కల్తీ పాల ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేసింది అన్నారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. విషపు పాలు తాగి రెండు రోజుల్లో నలుగురు చనిపోవడం అత్యంత బాధాకరం అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన షర్మిల..కిడ్నీ సమస్యతో పరిస్థితి విషమించి 8 మంది ఆసుపత్రుల్లో చేరడం ఆందోళనకరం అన్నారు.
మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆసుపత్రుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి తక్షణం మెరుగైన వైద్యసేవలు అందించాలి. చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. కల్తీ పాల సరఫరాపై నిజాలు నిగ్గుతేల్చాలి. ఉన్నత స్థాయి కమిటీ నియమించి దర్యాప్తు ముమ్మరం చేయాలి. కల్తీ పాలు ఘటనలో బాధితుల సంఖ్య పెరగకుండా తక్షణం మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలి అని డిమాండ్ చేశారు షర్మిల.
మరోవైపు రాజమండ్రి పాల కల్తీపై అసెంబ్లీలో ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చెప్పు ఆర్థిక సాయం చేస్తామని… ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పూర్తిగా సహకారం అందిస్తామన్నారు. ఎవరైనా కల్తీ చేస్తే ఉపేక్షించే పరిస్థితి లేదు… సమగ్ర దర్యాప్తు చేపట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు.
