అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ అమెరికాకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను తొలగించకపోతే దాడులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి.
అలాగే ప్రపంచానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గమైన హర్మూజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని కూడా మోజ్తాబా ఖమేనీ ప్రకటించారు. శత్రు దేశాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ జలసంధి ద్వారా ప్రపంచంలోని పెద్ద మొత్తంలో చమురు రవాణా జరుగుతుండటంతో, దీనిని మూసివేయడం గ్లోబల్ ఆయిల్ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం అందిస్తామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు యుద్ధాన్ని ముగించేందుకు కూడా ఇరాన్ సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చింది. ఈ విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వెల్లడించారు.
యుద్ధం ముగించాలంటే మూడు ప్రధాన షరతులు ఉండాలని ఆయన పేర్కొన్నారు. మొదటిగా ఇరాన్‌కు ఉన్న చట్టబద్ధ హక్కులను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని చెప్పారు. రెండవది, యుద్ధం కారణంగా దేశానికి మరియు ప్రజలకు జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలన్నారు. మూడవది, భవిష్యత్తులో ఇలాంటి దాడులు లేదా దురాక్రమణలు జరగకుండా అంతర్జాతీయ స్థాయిలో స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.
ఈ మూడు షరతులు నెరవేర్చితే యుద్ధాన్ని ముగించే దిశగా చర్చలకు సిద్ధమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ తాజా ప్రకటనలతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.
