హైదరాబాద్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.సమాచారం ప్రకారం నిత్యతేజ్ అనే బీటెక్ విద్యార్థి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ రెండో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, రెండో అంతస్తు నుంచి దూకడంతో నిత్యతేజ్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించారు. వెంటనే 108 అంబులెన్స్ అక్కడికి చేరుకుని అతడిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే నిత్యతేజ్ పరిస్థితి విషమించిందని, ఆసుపత్రికి చేరుకున్న తర్వాత వైద్యులు పరీక్షించి అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటన్న దానిపై విచారణ కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల వివరాలు కూడా సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
