అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం మరోసారి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత,తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి వైసీపీ సీనియర్ నేత , మాజీ జెడ్పీటీసీ చిదంబర్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి హల్ చల్ చేశారు.
పెద్దవడగూరు మండలంలో వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతగా ఉన్న చిదంబర్ రెడ్డిని ఊరు విడిచి వెళ్లిపోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో హెచ్చరించారు. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి నేరుగా తన అనుచరులతో కలిసి చిదంబర్ రెడ్డి ఇంటి పరిసరాల్లో వీరంగం సృష్టించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులు మరియు ఆయన అనుచరుల హల్‌చల్‌పై వైఎస్‌ఆర్‌సీపీ నేత చిదంబర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఆయన అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) జగదీష్‌ను నేరుగా కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనకు ,తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్న చిదంబర్ రెడ్డి, ముఖ్యంగా ముగ్గురు వ్యక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని ఆరోపించారు:
జేసీ ప్రభాకర్ రెడ్డి (టీడీపీ నేత),జేసీ అస్మిత్ రెడ్డి (తాడిపత్రి ఎమ్మెల్యే),పొట్టి రవి (జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు) నుండి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై బెదిరింపులకు దిగుతున్నారని, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో ఉన్నామని చిదంబర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తనకు , తన కుటుంబానికి తగిన పోలీస్ రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. ఈ ఘటనతో పెద్దవడగూరు మండలంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు.
