అమెరికాలో పుట్టుకతో వచ్చే పౌరసత్వం (Birthright Citizenship) పై జరుగుతున్న చర్చలో భాగంగా, భారతదేశం మరియు వలసదారులపై రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో రీపోస్ట్ చేశారు. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న తరుణంలో ట్రంప్ ఈ చర్యకు పాల్పడటం గమనార్హం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మైఖేల్ సావేజ్ వలసదారులు అమెరికా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ నేరుగా భారత్ పేరును ప్రస్తావించారు. విదేశీయులు అమెరికాకు వచ్చి “కేవలం ఇక్కడ ఒక బిడ్డను కంటారు” అని, ఆ బిడ్డ పౌరుడైన తర్వాత “చైనా, భారత్ లేదా భూమిపై ఉన్న మరేదైనా నరకం (Hell-hole)” నుండి తమ మొత్తం కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొస్తారని సావేజ్ విమర్శించారు.
మీకు అవకాశాలు శూన్యం, మీరు భారత్ లేదా చైనా నుండి వచ్చి ఉండాలి అని వ్యాఖ్యానించారు. అమెరికాలోని అంతర్గత వ్యవస్థలన్నీ భారతీయులు, చైనీయుల చేతుల్లోనే ఉండేలా ఏర్పాటు చేయబడ్డాయని ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపించారు. ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న దేశాల్లో చైనాతో పాటు భారత్ కూడా ఉందని ఆయన నొక్కి చెప్పారు.
అమెరికా సంప్రదాయ ‘మెల్టింగ్ పాట్’ (అన్ని సంస్కృతులు కలిసే విధానం) ఇప్పుడు లేదని సావేజ్ వాదించారు. పాత తరం యూరోపియన్ వలసదారులలాగా ప్రస్తుత వలసదారులు అమెరికా సంస్కృతిలో కలిసిపోవడం లేదని, దీనివల్ల దేశ గుర్తింపు మారిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న బర్త్ రైట్ సిటిజన్‌షిప్ వివరణను ఆయన “హాస్యాస్పదం” అని కొట్టిపారేశారు.
అమెరికన్ సివిల్ లిబరీస్ యూనియన్ (ACLU) అటువంటి వలసలను ప్రోత్సహిస్తోందని సావేజ్ మండిపడ్డారు. ఆ సంస్థను “పాము తల”గా అభివర్ణిస్తూ, అక్కడి లాయర్లు దేశాన్ని బలహీనపరిచేలా పనిచేస్తున్నారని ఆరోపించారు. పౌరసత్వం వంటి అంశాలను కోర్టులకు వదిలేయకుండా, ప్రజల ఓటు ద్వారా నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వీడియోను రీపోస్ట్ చేయడం ద్వారా ట్రంప్ తన పాత వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ను పరిమితం చేయాలని ఆయన మొదటి నుంచీ కోరుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఈ అంశంపై జరుపుతున్న వాదనల తీరును కూడా ట్రంప్ విమర్శించారు. అమెరికాలో పౌరులు కాని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వాన్ని రద్దు చేయాలనేది ట్రంప్ ప్రధాన రాజకీయ అజెండాలో ఒకటిగా ఉంది.
