- Advertisement -

అనుమానంతో భార్యను నరికి చంపిన భర్త

- Advertisement -

హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణ హత్య కలకలం రేపింది. కట్టుకున్న భార్యపై పెంచుకున్న అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని టీచర్స్ కాలనీలో ఈ ఘోరం చోటుచేసుకుంది.

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన నర్సింహ (60), వసంత (52) దంపతులు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. నర్సింహ కూలి పనులు చేస్తుండగా, వసంత సమీపంలోని ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

గత కొంతకాలంగా భార్య ప్రవర్తనపై నర్సింహ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి.నిన్న ఉదయం కూడా వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అనంతరం వసంత రోజువారీలాగే పనికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. ఆగ్రహంతో ఊగిపోయిన నర్సింహ, ఆమెను మధ్యలోనే అడ్డుకుని వెంట తెచ్చుకున్న గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

తీవ్ర గాయాలైన వసంత రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ఈ ఘోరాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.కుటుంబ కలహాలు మరియు అనుమానమే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించాం. నిందితుడు నర్సింహను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం అని పోలీసులు తెలిపారు.

చిన్నపాటి గొడవలు, అనవసరపు అనుమానాలు నిండు సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన వారే ఇలా ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా విషాదం నింపింది. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -