హైదరాబాద్ మేడిపల్లి పరిధిలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగ ఒత్తిడి, తీవ్ర మానసిక సమస్యలతో సతమతమవుతున్న యువతి, అర్ధరాత్రి తన తల్లిని గదిలో బంధించి, నగ్నంగా వీధుల్లో పరుగెత్తుతూ వెళ్లి చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయనగరం జిల్లాకు చెందిన తేజస్విని (25), గతంలో బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేది. అయితే, విధుల్లో తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక ఆరు నెలల క్రితం ఉద్యోగం వదిలేసింది. ప్రస్తుతం తన తల్లి అరుణతో కలిసి పీర్జాదిగూడలోని శంకర్‌నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటోంది. శుక్రవారం సాయంత్రం కొత్త ఇల్లు చూసుకునే పనిలో భాగంగా మియాపూర్‌లో గడిపి, రాత్రికి ఇంటికి చేరుకున్నారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో తేజస్విని నిద్రలేచి, తన తల్లి ఉన్న గదికి బయట నుంచి తాళం వేసింది. ఆ తర్వాత చేతిలో చీరతో నగ్నంగా వీధిలోకి వచ్చి పిచ్చిగా పరుగెత్తడం ప్రారంభించింది.
స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ప్రకారం, తేజస్విని మార్గమధ్యలో ఉన్న బీరప్ప గుడి వద్ద ఆగి దైవప్రార్థన చేసినట్లు మొక్కి, ఆపై పీర్జాదిగూడ చెరువు వైపు పరుగెత్తింది. అటుగా వెళ్లిన ఆమె నేరుగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నిద్రలేచిన తల్లి, గదికి తాళం వేసి ఉండటాన్ని గమనించి స్థానికులను పిలిపించి తలుపులు తెరిపించింది. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఆమె గాలించగా, చివరికి తేజస్విని చెరువులో విగతజీవిగా కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు, హైడ్రా, డీఆర్‌ఎఫ్ బృందాల సాయంతో మృతదేహాన్ని వెలికితీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు.
తన కుమార్తెకు గత కొంతకాలంగా తరచూ పీడకలలు వస్తుండేవని, తీవ్రమైన మానసిక సమస్యలు, ఫియర్ ఫోబియాతో సతమతమవుతోందని తల్లి అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగ ఒత్తిడితో మొదలైన ఆమె సమస్యలు, చివరకు ప్రాణాలను బలిగొన్నాయని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
