ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నా 10 ఏళ్ల కెరీర్‌లో ఇంతటి శక్తివంతమైన కథను నేను వినలేదు. బుచ్చిబాబు కథ చెప్పి ఆపిన తర్వాత, సుమారు 20 నిమిషాల పాటు నేను సాధారణ స్థితికి రాలేకపోయాను. అంతలా ఈ కథ నన్ను కదిలించింది అని పేర్కొన్నారు. థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ప్రేక్షకుడు బరువెక్కిన హృదయంతో, కళ్లల్లో నీళ్లతో బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
1970ల నాటి విజయనగరంఈ సినిమా కోసం ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. రాజధాని అమరావతి లేదా పల్లెటూరి నేపథ్యం ఏదైనా, సెట్లు అసలు సెట్లులా అనిపించకుండా అత్యంత సహజంగా నిర్మించారు. ఇందుకోసం దాదాపు ఒక సంవత్సరం పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులు జరిగాయి. 1970-80ల నాటి విజయనగరం పట్టణాన్ని, అక్కడి క్లాక్ టవర్, వీధులు, పాత ఇళ్లను సెట్ల రూపంలో మళ్లీ కళ్లముందుకు తీసుకువచ్చారు. మొత్తం 24 భారీ సెట్లు, 60కి పైగా సెటప్స్‌ను ఈ సినిమా కోసం వాడారు.
జూన్ 4న ఈ ‘ఎమోషనల్ రైడ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
