తమిళనాడులోని కోయంబత్తూరు (పొల్లాచి సమీపంలో) ఒక ఘోర ఘటన వెలుగుచూసింది. తన ప్రేమ ప్రతిపాదనను నిరాకరించిందనే కక్షతో ఒక ఉన్మాది.. యువతి నివాసం ఉంటున్న ఇంటిపైకి ఏకంగా పెట్రోల్ బాంబు (కిరోసిన్ బాంబు) విసిరాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ భయంకరమైన దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
పోలీసుల విచారణ ప్రకారం.. చెన్నైకి చెందిన కార్తీక్ అనే రౌడీ షీటర్ కోయంబత్తూరులో కాలేజీ చదువుతున్న ఒక యువతితో పరిచయం పెంచుకున్నాడు. అయితే కార్తీక్‌కు నేరచరిత్ర ఉందని.. అతనిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 36 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సదరు యువతికి తెలిసింది. దీంతో ఆమె అతనితో మాట్లాడటం పూర్తిగా మానేసి.. అతని ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ విషయంతో తీవ్ర అఘాయిత్యానికి లోనైన కార్తీక్.. గతంలోనే ఆ యువతిని చంపేస్తానంటూ పలుమార్లు బెదిరింపులకు దిగాడు.
కక్ష పెంచుకున్న నిందితుడు ఆదివారం రాత్రి తన అనుచరుడితో కలిసి ద్విచక్ర వాహనంపై యువతి ఇంటికి చేరుకున్నాడు. ఒక బీర్ సీసాలో కిరోసిన్ నింపి.. దానికి నిప్పు అంటించి ఒక్కసారిగా ఇళ్లపైకి విసిరేశాడు. బాంబు పడిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ప్రాణభయంతో ఇంట్లోని వారు.. చుట్టుపక్కల ప్రజలు కేకలు వేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దాడి చేసిన అనంతరం నిందితులు ఇద్దరూ బైక్‌పై అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు.
ఈ దారుణ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఉదంతం తమిళనాడు వ్యాప్తంగా మహిళల రక్షణపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలు.. పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.
