రాజస్థాన్‌లోని అజ్మేర్ సమీపంలో ఇటీవల జరిగిన ఒక కారు ప్రమాదానికి సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత అగ్ని ప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక.. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే కక్షతో మొదటి భార్య తన పిల్లలతో కలిసి చేసిన ఒక క్రూరమైన సామూహిక హత్యలకు పాల్పడింది. ఈ కేసులో మొదటి భార్య కపట నాటకం దాగి ఉందని పోలీసులు ఛేదించారు. నలుగురిని అతికిరాతకంగా చంపి.. ప్రమాదంగా చిత్రీకరించి.. ఏమీ తెలియనట్లు అంత్యక్రియల్లో గుండెలు బాదుకుంటూ ఏడ్చిన సదరు మహిళ చివరికి కటకటాలపాలైంది.
పోలీసుల కథనం ప్రకారం.. అజ్మేర్ హైవేపై గురువారం ఒక కారులో మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో సమీపంలోని పొలాల్లో తీవ్రమైన కత్తి గాట్లతో ఉన్న మరొక మృతదేహం లభ్యమవడంతో పోలీసులకు గట్టి అనుమానం వచ్చింది. మృతులను మాజీ సర్పంచ్ రామ్ సింగ్ చౌదరి.. ఆయన తల్లి.. ఆయన రెండో భార్య.. మేనకోడలుగా గుర్తించారు. ఈ అనుమానాస్పద మరణాలపై కేసు నమోదు చేసుకుని పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రామ్ సింగ్ మొదటి భార్య సునీతనే తన కూతురు.. మైనర్ కొడుకుతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది.
రామ్ సింగ్, సునీతలకు 2005లో వివాహం జరగ్గా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సునీతకు ఇష్టం లేకుండా రామ్ సింగ్ మరో మహిళను రెండో పెళ్లి చేసుకోవడంతో వారి సంసారంలో నిత్యం గొడవలు జరిగేవి. బుధవారం కూడా వీరి మధ్య పెద్ద వాగ్వాదం చోటుచేసుకోవడంతో.. ఎలాగైనా భర్తను మట్టుబెట్టాలని సునీత ప్లాన్ వేసింది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ముందుగానే ఒక కత్తిని కూడా ఆర్డర్ చేసి తెప్పించుకుంది. అదే రోజు రాత్రి నిద్రిస్తున్న రామ్ సింగ్‌పై సునీత.. ఆమె కుమార్తె సరిత.. మైనర్ కుమారుడు కలిసి కత్తితో పొడిచి దారుణంగా చంపేశారు. ఆపై సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు ఇంట్లో ఉన్న మిగిలిన ముగ్గురిని కూడా అలాగే హతమార్చారు.
ఈ దారుణాన్ని ఒక రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు మృతదేహాలన్నింటినీ కారులోకి ఎక్కించి.. ఇంటికి చాలా దూరంగా హైవేపైకి తీసుకెళ్లి కారుకు నిప్పంటించారు. అయితే కాలిపోవడానికి ముందే బాధితులంతా చనిపోయినట్లు ఫారెన్సిక్ రిపోర్టులో తేలడం గమనార్హం. దర్యాప్తులో భాగంగా బాధితుల ఇంటికి పోలీసులు వెళ్లినప్పుడు.. సునీత ఏమీ తెలియనట్లు గుండెలు బాదుకుంటూ భోరున విలపించింది. ఆమె నటన చూసి తొలుత పోలీసులు నమ్మినా.. సాంకేతిక ఆధారాల ముందు నిలవలేకపోయింది. విచారణలో మైనర్ బాలుడు నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు సునీత.. ఆమె కుమార్తెతో పాటు ఆ బాలుడిని అరెస్ట్ చేశారు.
