- Advertisement -

ముగ్గురి ప్రాణాలు కాపాడి.. అమెరికాలో తెలుగు యువకుడు వీరమరణం!

- Advertisement -

నదులు.. చెరువుల్లో మునిగిపోతున్న వారిని రక్షించి హీరోలుగా నిలిచే కథలను మనం సినిమాల్లో చూసుంటాం. కానీ అమెరికాలో నిజ జీవితంలో ముగ్గురు స్నేహితులను జల సమాధి కాకుండా కాపాడి.. చివరకు తనే విగతజీవిగా మారిన ఒక టెకీ ఉదంతం కన్నీళ్లు పెట్టిస్తోంది. పరాయి దేశంలో తోటి స్నేహితుల ప్రాణాలను కాపాడేందుకు ఒక తెలుగు యువకుడు తన ప్రాణాలనే పణంగా పెట్టిన‌ ఘటన అమెరికాలోని లూసియానా (Louisiana) రాష్ట్రంలో చోటుచేసుకుంది.

తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అనురూప్ రెడ్డి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లోని కవాడీగూడలో నివాసముంటోంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన అనురూప్ రెడ్డి ఇటీవలే నార్త్ టెక్సాస్‌లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి మే 29న టెక్సాస్.. లూసియానా సరిహద్దుల్లో ఉన్న ‘టొలెడో బెండ్ రిజర్వాయర్’ (Toledo Bend Reservoir) కు సరదాగా సమయం గడపడానికి వెళ్లారు. అక్కడ రిజర్వాయర్ నీటి ప్రవాహంలో అనురూప్ ముగ్గురు స్నేహితులు అనుహ్యంగా కొట్టుకుపోతూ మునిగిపోసాగారు.

అది గమనించిన అనురూప్ రెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకాడు. అతనికి ఈత బాగా వచ్చినప్పటికీ.. ప్రాణాపాయంలో ఉన్న తన ముగ్గురు స్నేహితులను ఒకరి తర్వాత ఒకరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. అయితే దురదృష్టవశాత్తు చివరి నిమిషంలో నీటి అడుగున ఉన్న చేపలు పట్టే వలలో అనురూప్ కాలు బలంగా చిక్కుకుపోయింది. వల నుంచి కాలును బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా వీలుకాకపోవడంతో అతను నీటిలోనే మునిగిపోయాడు. సమాచారం అందుకున్న స్థానిక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి గాలించగా.. సుమారు 20 అడుగుల లోతు నుంచి అనురూప్ రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశాయి. చదువు పూర్తి చేసుకుని ఉన్నత స్థానానికి చేరుకుంటాడనుకున్న కొడుకు.. స్నేహితుల కోసం ప్రాణాలు విడిచి శవమై తిరిగిరావడంతో హైదరాబాద్‌లోని అతని కుటుంబ సభ్యులు.. సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -