భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ అంతర్జాతీయంగా విస్తరిస్తోంది. ఇది బ్రాడ్‌కాస్టర్లు (ప్రసారదారులు) తమ వ్యూహాలను మార్చుకునేలా చేస్తోంది. శ్రీలంకలో భారత్, ఆఫ్ఘనిస్తాన్, మరియు ఆతిథ్య శ్రీలంక జట్ల మధ్య జరగనున్న ‘ఎ’ జట్ల ముక్కోణపు సిరీస్ కోసం భారత జట్టులో సూర్యవంశీని ఎంపిక చేయడం తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. దీంతో ఈ సిరీస్‌ను టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని అధికారులు నిర్ణయించారు.
తిలక్ వర్మ నేతృత్వంలోని ఈ ఇండియా ఏ జట్టులో 15 ఏళ్ల టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచిన సూర్యవంశీ ఉనికి, ఈ ముక్కోణపు సిరీస్ స్థాయిని ఒక్కసారిగా పెంచేసింది.
జూన్ 9 నుండి 21 వరకు దంబుల్లా వేదికగా వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ సిరీస్‌ను ‘సోనీ స్పోర్ట్స్’ మరియు ‘సోనీ లివ్’ లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. శ్రీలంక క్రికెట్ అధికారిక బ్రాడ్‌కాస్ట్ భాగస్వామిగా ఉన్న సోనీ నెట్‌వర్క్, ఈ టోర్నమెంట్‌ను పూర్తిస్థాయి కవరేజ్‌తో లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు ధృవీకరించింది. ఇటీవల కాలంలో వరల్డ్ కప్, ఐపీఎల్ ప్రసార హక్కులను ప్రత్యర్థి ఛానల్ జియో హాట్‌స్టార్ దక్కించుకోవడంతో సోనీ క్రికెట్ యాక్షన్‌కు దూరమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తున్న ‘సూర్యవంశీ ఫీవర్’ను పూర్తిగా వాడుకోవాలని సోనీ నిర్ణయించింది.
సోనీ నెట్‌వర్క్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో…ఈ హై-ఓల్టేజ్ ముక్కోణపు సిరీస్‌లో స్టేజ్‌ను షేక్ చేయడానికి ‘సూర్యవంశీ ఎక్స్‌ప్రెస్’ వస్తోంది అని ప్రకటించింది. ఆగస్టు రెండో అర్ధభాగంలో జరగబోయే భారత్-శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్ ప్రసార హక్కులు కూడా సోనీ వద్దే ఉన్నాయి. ఈ లోపు జరిగే లంక ప్రీమియర్ లీగ్ (LPL) మాత్రం జియో హాట్‌స్టార్‌లో రానుంది.
