వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపింది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. బ్రహ్మనాయుడు కుటుంబానికి పూర్తి అండగా నిలిచారు.
బ్రహ్మనాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే బ్రహ్మనాయుడు కుమారుడు గిరిబాబుతో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. అరెస్టుకు దారితీసిన పరిస్థితులు…నమోదు చేసిన కేసుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గిరిబాబుకు,వారి కుటుంబానికి జగన్ భరోసా ఇచ్చారు. అధికార పార్టీ చేస్తున్న తప్పుడు ఆరోపణలకు…రాజకీయ కక్షసాధింపు చర్యలకు ఎంతమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. పార్టీ పరంగా బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబానికి అన్ని విధాలా తోడుగా ఉంటామని అవసరమైన పూర్తి న్యాయ సహాయాన్ని అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
మరోవైపు బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం పోలీసులు బ్రహ్మనాయుడును కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలుకు తరలించారు.
