బీహార్ రాష్ట్రంలో వంతెనలు కూలిపోయే సిరీస్ కొనసాగుతోంది. తాజాగా పశ్చిమ చంపారన్ జిల్లా పరిధిలోని బెట్టియాలో, ధనౌతి నదిపై నిర్మించిన ఒక వంతెన మంగళవారం ఉదయం కుప్పకూలింది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
ఈ వంతెన కూలిపోవడంతో బెట్టియాను చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాలకు అనుసంధానించే ప్రధాన రహదారి కట్ అయిపోయింది. దీనివల్ల నిత్యం ప్రయాణించే వేలాది మంది స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక యంత్రాంగం…పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు వంతెన పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. కూలిపోయిన భాగాలను పరిశీలించి, రాకపోకలను పునరుద్ధరించడానికి తాత్కాలిక ఏర్పాట్లు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
బీహార్లో గత కొంతకాలంగా వరుసగా వంతెనలు కూలిపోతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ధనౌతి నదిపై ఉన్న ఈ వంతెన కూలడానికి నిర్మాణంలో నాణ్యతా లోపమా లేక సరైన నిర్వహణ లేకపోవడమే కారణమా అనే కోణంలో స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల కల్పన మరియు నాణ్యతా ప్రమాణాలపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది.
