ఏపీ కేబినెట్ సమావేశంలో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన సెక్రటేరియట్లో అత్యంత కీలకమైన కేబినెట్ భేటీ కొనసాగుతుండగానే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగియకముందే మధ్యలోనే అక్కడి నుంచి వచ్చేయడం చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ ఇలా కేబినెట్ సమావేశం మధ్యలో నుంచి వచ్చేయడానికి రాజకీయ కారణాలేవీ లేవని…ఆయన అస్వస్థతకు గురికావడమే ప్రధాన కారణమని జనసేన పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్‌ను తీవ్రమైన వెన్నునొప్పి సమస్య వేధిస్తోంది. ఈ రోజు కేబినెట్ సమావేశంలో పాల్గొన్న సమయంలో మళ్లీ వెన్నునొప్పి తీవ్రమవడంతో ఆయన కూర్చోలేకపోయారని అందుకే ముఖ్యమంత్రి అనుమతి తీసుకుని సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీ నుంచి మధ్యలోనే వచ్చేయడం ఈ నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు ఈనెల 4వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఆయన సగం నుంచే వెనుదిరిగారు. అప్పుడు కూడా వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యల వల్లే ఆయన వెళ్లినప్పటికీ.. వరుసగా రెండోసారి కూడా కేబినెట్ ముగియకముందే డిప్యూటీ సీఎం బయటకు వచ్చేయడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
