యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ ప్రవర్తన ఇప్పుడు పుణేలో తీవ్ర కలకలం రేపుతోంది. క్రైమ్ సీన్ రీక్రియేషన్ ముగించుకుని వస్తున్న సమయంలో ఆమె మీడియా వైపు చూస్తూ అసభ్య సైగలు (మిడిల్ ఫింగర్ చూపించడం) చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జూన్ 18న పుణే సమీపంలోని లోహగఢ్ కోట లోయలో కేతన్ అగర్వాల్ అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. మొదట దీనిని ప్రమాదంగా భావించినప్పటికీ, పోలీసుల విచారణలో ఇదొక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా తేలింది. సియా గోయల్, కేతన్ అగర్వాల్‌లకు కుటుంబ సభ్యులు నవంబర్‌లో వివాహం నిశ్చయించారు. అయితే, సియా తన ప్రియుడు చేతన్‌తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో నిందితులు నోరు విప్పకపోవడంతో, ఎవరు కేతన్‌ను లోయలోకి తోశారనే విషయంపై స్పష్టత రాలేదు. దీంతో నిందితులకు లై డిటెక్టర్ (పాలిగ్రాఫ్) పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పరీక్షలకు నిందితుల సమ్మతి తప్పనిసరని ఆమె తరఫు న్యాయవాది వాదిస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షులు లేని ఈ కేసులో పోలీసులు డిజిటల్, సాంకేతిక ఆధారాలపైనే పూర్తిగా ఆధారపడ్డారు. జనవరి నుండి జూన్ వరకు సియా, చేతన్ మధ్య 2,000 కంటే ఎక్కువ ఫోన్ కాల్స్ నడిచినట్లు కాల్ డేటా విశ్లేషణలో తేలింది. అంతేకాకుండా, కేతన్ మరణించిన తర్వాత అతని మొబైల్ ఫోన్ కొంత సమయం పాటు సియా వద్దే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. సంఘటన జరిగిన రోజున 33 డిగ్రీల తీవ్రమైన ఎండ ఉన్నప్పటికీ, చేతన్ హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరిగిన దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి.
దర్యాప్తులో భాగంగా పుణే రూరల్ పోలీసులు లోహగఢ్ కోట వద్ద రెండు దశల్లో సీన్ రీక్రియేషన్ నిర్వహించారు. సియా సమక్షంలో డమ్మీ సాయంతో ఒకసారి, చేతన్‌ను తీసుకెళ్లి మరోసారి సంఘటనను పునర్నిర్మించారు. ప్రస్తుతం నిందితులు పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. ఈ కేసు తీవ్రతను బట్టి ప్రభుత్వం దీనిని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసింది. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103 (హత్య), సెక్షన్ 61 (కుట్ర) కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
