- Advertisement -

‘కెప్టెన్ కూల్’@ 45

- Advertisement -

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన నాయకుడు, అభిమానుల గుండెల్లో ‘కెప్టెన్ కూల్’గా ముద్ర వేసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ ఇవాళ తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రైల్వే స్టేషన్‌లో ఒక సాధారణ టికెట్ కలెక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి…భారతదేశానికి అత్యధిక ఐసీసీ (ICC) ట్రోఫీలను అందించిన గొప్ప ‘ట్రోఫీ కలెక్టర్’గా ఎదిగిన ధోనీ ప్రస్థానం ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఎందరికో స్ఫూర్తిదాయకం.

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ధోనీ…మొదట్లో బంతిని బాదే విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాలక్రమేణా తన దూకుడును వ్యూహాత్మకంగా మార్చుకుంటూ ప్రపంచంలోనే అత్యుత్తమ ‘ఫినిషర్’గా అవతరించాడు. భారతదేశం తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 538 మ్యాచ్‌లు ఆడిన మహీ.. 17,266 పరుగులు సాధించడంతో పాటు 829 మందిని వికెట్ల వెనుక అవుట్ చేశాడు. వికెట్ కీపర్-బ్యాటర్ పాత్రకు సరికొత్త నిర్వచనాన్ని ఇస్తూ వన్డే క్రికెట్‌లో సరికొత్త విప్లవాన్ని తెచ్చాడు.

ధోనీ తన కెరీర్‌లో 350 వన్డేలు ఆడి 50.57 అద్భుతమైన సగటుతో 10,773 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అతని అత్యుత్తమ స్కోరు నాటౌట్ 183. భారతదేశం తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో ధోనీ ఆరో స్థానంలో ఉన్నాడు. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తూ, ఒత్తిడి సమయాల్లో ఇన్నింగ్స్ నిర్మిస్తూ కూడా 50కి పైగా సగటును కాపాడుకోవడం ధోనీకి మాత్రమే సాధ్యమైంది.

వన్డే కెప్టెన్సీ: భారత్‌కు 200 వన్డేల్లో నాయకత్వం వహించి 110 మ్యాచ్‌ల్లో విజయాన్ని అందించాడు. 74 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురవగా, 5 మ్యాచ్‌లు టై అయ్యాయి. వన్డేల్లో అతని విన్నింగ్ శాతం 55% గా ఉంది.ధోనీ నాయకత్వంలోనే యువ భారత్ 2007లో మొట్టమొదటి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఇది భారత క్రికెట్‌లో సరికొత్త శకానికి నాంది పలికింది. అతను 98 అంతర్జాతీయ టీ20ల్లో 37.60 సగటు, 126.13 స్ట్రైక్ రేట్‌తో 1,617 పరుగులు చేశాడు.

టీ20 కెప్టెన్సీ: కెప్టెన్‌గా 72 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 41 విజయాలను అందించాడు. అతని విజయాల శాతం 56.94% గా నమోదైంది.పరిమిత ఓవర్ల క్రికెట్ లోనే కాకుండా టెస్టుల్లోనూ ధోనీ తన ముద్ర వేశాడు. 90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ధోనీ 38.09 సగటుతో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలతో కలిపి 4,876 పరుగులు చేశాడు. ఇందులో ఒక ద్విశతకం (224 పరుగులు) కూడా ఉంది.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మూడు వేర్వేరు ఐసీసీ ట్రోఫీలను (2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ) గెలుచుకున్న ఏకైక కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ మాత్రమే. ఈ అసాధారణమైన కెరీర్ మరియు అద్భుతమైన నాయకత్వ పటిమ వల్లే, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా కూడా ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -