ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఒక పోలీసు అధికారి దారుణంగా ప్రవర్తించాడు. లిఫ్ట్ అడిగి ఎక్కించుకున్న ట్రక్ డ్రైవర్ దగ్గరే రూ. 20 వేలు కాజేసి, ఆపై బెదిరించేందుకు ప్రయత్నించాడు. చివరకు డ్రైవర్ చూపిన ధైర్యంతో దొంగ పోలీసు బండారం బయటపడింది.
హమీర్‌పూర్‌లో ఒక సబ్-ఇన్స్పెక్టర్ ట్రక్ డ్రైవర్‌ను ఆపి టోల్ ప్లాజా వరకు లిఫ్ట్ అడిగారు. పోలీస్ అధికారి కదా అని నమ్మి డ్రైవర్ తన ట్రక్కులో ఎక్కించుకున్నాడు. టోల్ ప్లాజా వద్దకు చేరుకోగానే ఆ అధికారి అక్కడ దిగి తన వ్యక్తిగత కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే, కాసేపటికే తన దగ్గర ఉన్న రూ. 20 వేల నగదు కనిపించడం లేదని డ్రైవర్ గుర్తించాడు. వెంటనే ఆ అధికారి తన డబ్బులే కాజేశాడని డ్రైవర్‌కు అర్థమైంది.
డ్రైవర్ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన ట్రక్కును వేగంగా పోనిస్తూ సుమారు 10 కిలోమీటర్ల దూరం సదరు అధికారి కారును వెంబడించాడు. చివరికి ఒక చోట ఆ కారును అడ్డగించి ఆపాడు. వెంటనే ఆ అధికారిని నిలదీసి, తన డబ్బులు ఎక్కడని గట్టిగా అడిగాడు. ఆ సమయంలో సదరు ఎస్సై తన ఖాకీ పవర్‌తో డ్రైవర్‌ను బెదిరించేందుకు ప్రయత్నించారు. కానీ డ్రైవర్ ఏ మాత్రం భయపడకుండా అతడిని ఎదిరించాడు. చివరికి ఆ అధికారి జేబులో ఉన్న రూ. 20 వేల నగదును డ్రైవర్ స్వయంగా రికవరీ చేశాడు.
పోలీస్ శాఖలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇంతటి నీచమైన పనికి ఎలా పాల్పడతారని డ్రైవర్ నలుగురి ముందు అతడికి తగిన బుద్ధి చెప్పాడు. అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రక్షక భటుడే భక్షకుడిగా మారిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దొంగతనానికి పాల్పడిన ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
