అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, చిత్రబృందం నిర్వహించిన సక్సెస్ మీట్లో నాగార్జున ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అఖిల్ కెరీర్లో ఈ విజయం చాలా ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి తాను ఎప్పుడూ ఏమీ కోరుకోనని, కానీ ఇటీవల వెళ్లినప్పుడు మాత్రం అఖిల్‌కు మంచి హిట్ ఇవ్వాలని శ్రీవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని నాగార్జున వెల్లడించారు. ‘లెనిన్’ చిత్రబృందం ఎంతో కష్టపడిందని, అఖిల్ కోరుకున్న విజయాన్ని ఈ సినిమా అందించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
ఈ సినిమాకు తన పెద్ద కుమారుడు తారక్ (నాగ చైతన్య) వాయిస్ ఓవర్ ఇచ్చారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు, ఎడిటర్ నవీన్ అంకితభావంతో పనిచేశారని, భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ప్రశంసించారు. విడుదలకు ముందు టెన్షన్ పడిన భాగ్యశ్రీకి అప్పుడు తాను ధైర్యం చెప్పానని, కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కిందని అన్నారు. నిర్మాత నాగవంశీ సహకారం మరువలేనిదని తెలిపారు.
అఖిల్ చిన్నప్పటి నుండి ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటాడని, ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడతాడని నాగార్జున కొనియాడారు. అయితే, ఒక ప్రమాదం వల్ల అఖిల్ చేతికి తీవ్ర గాయమైందని, ఆ సమయంలో చేయి మళ్లీ మామూలుగా వస్తుందో లేదోనని తామంతా చాలా టెన్షన్ పడ్డామని చెప్పారు. ఆ ఘటన తర్వాత అఖిల్‌లో చాలా మార్పు వచ్చిందని, నిదానంగా ఆలోచించడం నేర్చుకున్నాడని తెలిపారు. అదే సమయంలో పెళ్లి కూడా కావడంతో, అతడికి ఒక తోడు దొరికిందని, అఖిల్ జీవితంలో ‘గుడ్ టైమ్’ మొదలైందని నాగార్జున భావోద్వేగంతో చెప్పారు.
చివరిగా తన కుమారులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ తనకు రెండు కళ్లు వంటివారని, అక్కినేని అభిమానుల నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని నాగార్జున ముగించారు.
