రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఆరుగురు సభ్యులను పొట్టనబెట్టుకున్న నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. ఈ దారుణ ఘటనలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన షాబాద్ ఎస్సై రమేశ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతిని ప్రభుత్వం ప్రకటించింది.
పరారీలో ఉన్న నిందితుడు రాజ్‌కుమార్ కోసం 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, సమీపంలోని టోల్ ప్లాజా వద్ద ఉన్న వాహనాల వివరాలను సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో బాధ్యులైన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నిందితుడు రాజ్‌కుమార్ పక్కా ప్రణాళికతో ఈ హత్యలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తనపై పోక్సో కేసు నమోదు చేసిన మైనర్ బాలికపై పగతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. షాబాద్ పిఆర్ఆర్ స్టేడియం సమీపంలో ఉన్న మైనర్ బాలిక (17) ఇంటికి వెళ్లి, ఆమెను లాక్కెళ్లే క్రమంలో అడ్డుపడిన తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మలను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ఆ మైనర్ బాలికను దైవాలగూడ సమీపంలోని అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి గొంతు కోసి హతమార్చాడు.
చివరిగా కుటుంబంపై దాడి: ఆ తర్వాత నిందితుడు దైవాలగూడలోని తన ఇంటికి వచ్చి భార్య సరిత (33), తన ఇద్దరు కుమారులు పరీక్షిత్ (4), దైవీక్షిత్ (2)లను కూడా దారుణంగా కత్తితో కోసి హతమార్చాడు.
కేవలం ఒక పోక్సో కేసు కక్షతో కుటుంబాలను బలితీసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది. నిందితుడు రాజ్‌కుమార్ కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
