ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-0తో చేజార్చుకోవడమే కాకుండా గత 1,601 రోజులుగా కాపాడుకుంటూ వస్తున్న నంబర్ వన్ టీ20 ర్యాంకింగ్‌ను కూడా భారత్ కోల్పోయింది. కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన రెండో సిరీస్ కూడా ఇంతటి భారీ ఓటమిని ఎదుర్కొన్న శ్రేయాస్ అయ్యర్…దీనిని గొప్ప నేర్చుకునే ప్రక్రియగా అభివర్ణించారు.
సౌతాంప్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో 56 పరుగుల తేడాతో ఓడిపోయిన అనంతరం అయ్యర్ ..ఈ కఠినమైన పరిస్థితులు భవిష్యత్తులో తనను ఒక మంచి లీడర్‌గా మార్చడానికి ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమ జట్టు ప్రదర్శనలో ఉన్న లోపాలను నిజాయితీగా అంగీకరించారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఇక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులకు అలవాటు పడటంలో మేము కాస్త ఇబ్బంది పడ్డాము. ఈ సిరీస్‌లో ప్రత్యర్థి జట్టు అన్ని రంగాల్లో మా పై ఆధిపత్యాన్ని ప్రదర్శించిందన్నారు.
“ఒక లీడర్‌గా కెప్టెన్సీ పరంగా ఇది నాకు కఠినమైన ఆరంభమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఇలాంటి క్లిష్ట పరిస్థితులే మనకు ఎన్నో విషయాలను నేర్పుతాయి. ఈ సిరీస్ నుండి నేను నేర్చుకున్న పాఠాలు, భవిష్యత్తులో ముందుకు సాగడానికి నన్ను ఒక మంచి కెప్టెన్‌గా, ఆటగాడిగా మెరుగుపరుస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను అని అయ్యర్ పేర్కొన్నారు.
ప్రొఫెషనల్ క్రికెటర్లుగా అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా త్వరగా మారాల్సిన అవసరం ఉందని, రాబోయే రోజుల్లో జట్టుగా కమ్యూనికేషన్ మెరుగుపరుచుకుని లోపాలను సరిదిద్దుకుంటామని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశారు.
