విశాఖపట్నంలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉన్న జనం భూప్రకంపనల ధాటికి ఉలిక్కిపడి లేచి, ప్రాణాలు చేతబట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
నగరంలోని తీర ప్రాంతాలతో పాటు పలు నివాస ప్రాంతాలలో ఈ భూప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖలోని కింది ప్రాంతాల్లో భూమి కంపించింది:
సాగర్ నగర్,తాటిచెట్లపాలెం,సీతమ్మధార,మాధవధార,పెద్ద వాల్తేరు,ఈస్ట్ పాయింట్ కాలనీ,హెచ్‌బీ కాలనీలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని అధికారులు వెల్లడించారు. కాకినాడకు తూర్పున సుమారు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం (ఎపిసెంటర్) ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్రంలో సంభవించిన ఈ ప్రకంపనల ప్రభావం విశాఖ తీర ప్రాంతంపై పడింది.
తెల్లవారుజామున ఒక్కసారిగా మంచాలు కదలడం, ఇంట్లోని వస్తువులు శబ్దం చేయడంతో ప్రజలు భూకంపంగా గ్రహించి వీధుల్లోకి వచ్చారు. చాలా సేపటి వరకు ఇళ్లల్లోకి వెళ్లేందుకు జనం భయపడ్డారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు.
