ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పోర్టుల అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల రెండో దశ భూసేకరణకు పరిపాలనా అనుమతి జారీ చేసింది.
ఈ దశలో మొత్తం 6,248.54 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,638.52 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు అభివృద్ధి కోసం 1,903.39 ఎకరాలు, మచిలీపట్నం పోర్టు కోసం 1,420.70 ఎకరాలు, రామాయపట్నం పోర్టు కోసం 2,924.45 ఎకరాల భూమిని సేకరించనున్నారు.
రాష్ట్రంలో సముద్ర రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, ఎగుమతులు-దిగుమతులను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా ఈ పోర్టుల విస్తరణ చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భూసేకరణ పూర్తయిన అనంతరం మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
పోర్టుల అభివృద్ధి ద్వారా తీరప్రాంత జిల్లాల్లో పెట్టుబడులు పెరగడంతో పాటు, లాజిస్టిక్స్ రంగానికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

