- Advertisement -

అనుమానపు భూతం.. నిండు గర్భిణి బలవన్మరణం!

- Advertisement -

తల్లి కాబోతున్నాననే సంతోషంలో మునిగి తేలాల్సిన ఓ నిండు గర్భిణి, కట్టుకున్న భర్త అనుమానపు వేధింపులకు బలైంది. కడుపులో పెరుగుతున్న బిడ్డపైనే అనుమానం వ్యక్తం చేస్తూ భర్త సాగించడంతో.. చిత్రహింసలు తట్టుకోలేక మెదక్ జిల్లా గడి పెద్దాపూర్‌లో సుష్మిత (25) అనే గర్భిణి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

వికారాబాద్ జిల్లాకు చెందిన సుష్మితకు, మెదక్ జిల్లా గడి పెద్దాపూర్‌కు చెందిన అభిలాష్‌తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. మొదట్లో అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య, సుష్మిత గర్భం దాల్చిన తర్వాత నుండి అనుమానం అనే భూతం చిచ్చు పెట్టింది. కడుపులో పెరుగుతున్న బిడ్డ తనది కాదంటూ అభిలాష్ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రూరత్వానికి తోడుగా అత్త లక్ష్మి కూడా కోడలిని సూటిపోటి మాటలతో వేధించేది.

సుష్మిత ఐదు నెలల గర్భిణి కావడంతో సీమంతం వేడుక గురించి మాట్లాడేందుకు ఆమె తల్లిదండ్రులు అభిలాష్ ఇంటికి వెళ్లారు. అక్కడ కూతురి దీనస్థితిని, అల్లుడు చేస్తున్న వేధింపులను చూసి వారు నిర్ఘాంతపోయారు. ‘‘నీ కడుపులోని బిడ్డకు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తా’’ అంటూ భర్త చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు, భౌతిక దాడులతో సుష్మిత తీవ్ర మనస్తాపానికి గురైంది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు పెట్టినా అభిలాష్ తన ప్రవర్తన మార్చుకోలేదు.

భర్త వేధింపుల నుంచి బయటపడలేక, పుట్టబోయే బిడ్డకు తండ్రి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆవేదన చెందిన సుష్మిత, జూన్ 25న బెడ్‌రూమ్‌లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. సుష్మిత మరణానికి భర్త అభిలాష్, అత్త లక్ష్మి కారణమని ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. నిండు గర్భిణిని అనుమానంతో వేధించి, కన్నతల్లితో పాటు కడుపులోని బిడ్డను కూడా బలిగొన్న ఈ ఘటన మెదక్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. కట్టుకున్నవాడే కసాయిలా మారడంతో సుష్మిత ఆశలన్నీ అడియాసలయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -