టీమిండియా వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో తన 51వ సెంచరీ సాధించాడు. లండన్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో వన్డే సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్‌గా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. 39 ఏళ్ల రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, కేవలం 84 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకున్నారు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో రోహిత్ అద్భుత ప్రదర్శన చేశారు. ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ చెలరేగి ఆడి ఈ చారిత్రాత్మక సెంచరీని నమోదు చేశారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్.. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పటిష్టం చేశారు. గిల్ అవుట్ అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ఆడిన రోహిత్, ఒక బౌండరీతో 84 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నారు.
ఈ సెంచరీ ద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో సెంచరీ సాధించిన అత్యంత వృద్ధ భారతీయ ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించారు. అయితే, వీటన్నింటికంటే క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా నిలవడం విశేషం.రోహిత్ శర్మ కెరీర్ పరంగా ఈ సెంచరీ అత్యంత కీలకమైన సమయంలో వచ్చింది. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో.. లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ కెరీర్‌లో చివరి వన్డే కానుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
మొదటి రెండు వన్డేల్లో వరుసగా 11, 26 పరుగులకే అవుట్ అయిన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌తో ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 110 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 138 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.
