జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఓ అగంతకుడు సృష్టించిన బీభత్సం తీవ్ర కలకలం రేపింది. బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లడమే కాకుండా, దారి పొడవునా వాహనాలను ఢీకొంటూ సినిమా ఫక్కీలో హల్చల్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సాహసోపేతంగా 18 కిలోమీటర్ల దూరం వెంబడించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోనకు చెందిన టీఎస్ 08 జెడ్ 0103 నంబరు గల ఆర్టీసీ బస్సును డ్రైవర్ ప్రవీణ్ కోరుట్ల బస్టాండ్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫాంపై నిలిపారు. అనంతరం డ్రైవర్, కండక్టర్ పక్కకు వెళ్లిన సమయంలో, ఓ గుర్తుతెలియని వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా నేరుగా బస్సు ఎక్కాడు. క్షణాల్లో ఆ బస్సును స్టార్ట్ చేసి నిజామాబాద్ వైపు పోనిచ్చాడు. బస్సు కదలడాన్ని గమనించిన ఆర్టీసీ ఉద్యోగులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో మెట్పల్లి సర్కిల్ పోలీసులు రంగంలోకి దిగి, ఆర్టీసీ సిబ్బందితో కలిసి ప్రత్యేక వాహనాల్లో ఆ బస్సును వెంబడించడం ప్రారంభించారు. అయితే, ఆ దుండగుడు మరింత బరితెగించి దారి పొడవునా బీభత్సం సృష్టించాడు. కోరుట్ల, ఆరపేట, వెంకట్రావుపేట ప్రాంతాల వద్ద మూడు ద్విచక్ర వాహనాలను బస్సుతో బలంగా ఢీకొట్టడంతో వాహనదారులు స్వల్పంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా, తమను వెంబడిస్తున్న పోలీసు వాహనాన్ని సైతం ఆ దుండగుడు ఢీకొట్టడంతో పోలీస్ వాహనం స్వల్పంగా ధ్వంసమైంది.
పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసులు వెంటనే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అప్రమత్తమైన స్థానిక సిబ్బంది, మెట్పల్లి మండల పరిధిలోని గండి హనుమాన్ సమీపంలో జాతీయ రహదారికి అడ్డుగా భారీ వాహనాలను నిలిపి ట్రాఫిక్‌ను కట్టడి చేశారు. ముందుకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఆ అగంతకుడు బస్సును పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి ఆపేశాడు. బస్సు ఆగగానే అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించగా, వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
