ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక హెచ్చరిక జారీ చేసింది. రేపు గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని…కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే ముప్పు ఉందని వెల్లడించింది. వర్షంతో పాటు ఈదురుగాలులు, ఉరుములు మరియు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు మరియు మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వెల్లడించింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు.
పార్వతీపురం మన్యం, పోలవరం, తూర్పుగోదావరి, పల్నాడు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి చినుకులు లేదా తేలికపాటి వర్షాలు నమోదు కావచ్చు.ఉరుములు, పిడుగుల ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
వర్షం పడే సమయంలో లేదా ఉరుములు వస్తున్నప్పుడు విద్యుత్ స్తంభాలు, ఫోన్ టవర్లు, పెద్ద చెట్ల కింద మరియు బహిరంగ ప్రదేశాల్లో ఉండటం అత్యంత ప్రమాదకరం జాగ్రత్త అని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు మరియు పశువుల కాపరులు వర్షం సూచన కనిపించగానే సురక్షితమైన భవనాల్లోకి ఆశ్రయం పొందాలని విజ్ఞప్తి చేశారు.
