ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. మొదట వైసీపీ నుంచి టీడీపీలోకి అధికారం కోసం వెళ్లిన నాయకులు ఆ తర్వాత టీడీపీ నుంచి వైసీపీ వైపు కొందరు నేతలు మొగ్గు చూపించారు. తాజగా అటు కొందరు నాయకులు.. ఇటు కొందరు నాయకులు తమ లాభాం కోసం పార్టీలు మారుతున్నారు.
నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన అనంతరం మరోసారి టీడీపీ తెరవెనుక మంత్రాగం నడిపినట్టు తెలుస్తోంది. వైసీపీలో ఉన్న నాయకులను ఖాళీ చేసేందుకు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించినట్టు సమాచారం. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నుంచి నలుగురు కీలక వైసీపీ నేతలతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన కీలకమైన నేత ఒకరు టీడీపీలో చేరనున్నట్టు సమాచారం.
దీని వెనుక ఆదినారాయణ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, సీఎం రమేష్ మంత్రాగం నడిపినట్టు సమాచారం. వైసీపీకి చెందిన గుర్నాథరెడ్డి, ఎంపీ బుట్టా రేణుకలు పార్టీ మారనున్నట్టు గతంలో ఊహాగానాలు చెలరేగిన విషయం తెలిసిందే. రేపటికల్లా ఈ వలసలు ప్రారంభమై వారం రోజుల్లో ముగియనున్నట్టు సమాచారం. దీంతో ఆ పార్టీ నుంచి మరిన్ని వలసలు ఊపందుకుంటాయని టీడీపీ నేతలు గట్టిగా భావిస్తున్నారు.
