ఏపిలో వైసీపీ అధినేత చల్లగా తన పని తాను చేసుకుంటూపోతున్నారు. పాదయాత్రలో ఓ పక్క పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతూనే, ప్రభుత్వం చేస్తున్న తప్పులను వేలెత్తిచూపుతున్నారు. మరో పక్క ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ఖాళీ కాగా.. తాజాగా టీడీపీ నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరుతున్నారు. దీంతో రోజు రోజుకీ పార్టీకి బలం పెరుగుతోంది.
తాజాగా కృష్ణాజిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏపీ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో చేరనున్నారు. గత కొన్ని రోజుల నుంచి వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్న ఆయన… వచ్చే వారం ప్రజాసంకల్ప యాత్రలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు సమాచారం.
1999 ఎన్నికల్లో నందిగామ నుంచి పోటీ చేసిన కృష్ణప్రసాద్ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో గుంటూరు-2 స్థానం నుంచి ఆయనను రంగంలోకి దించాలని టీడీపీ భావించినప్పటికీ… కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో ఆయనకు నందిగామ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. తంగిరాల గెలుపుకు ఆయన కృషి చేశారు. తంగిరాల మరణించిన తర్వాత ఉప ఎన్నిక నుంచి ఆయనను దూరంగా ఉంచారు. దీంతో మన స్థాపం చెంది అయన వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ పరంగా కూడా వసంత కృష్ణప్రసాద్‌కు పెద్ద ప్రాధాన్యత దక్కలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ కూడా ఆయనను ఒకటి, రెండు సందర్భాల్లో పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో, వైసీపీలోకి చేరేందుకు ప్రస్తుతం ఆయన సిద్ధమయ్యారని తెలుస్తోంది. జగన్ పాయదాత్ర కృష్ణాజిల్లాలోకి ప్రవేశించిన వెంటనే పెద్ద ఎత్తున తన అనుచరులతో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
