తిరుపతిలో జనసేన పార్టీ నాయకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని, రాజకీయ వర్గాల్లో కలకలాన్ని రేపింది. అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివకుమార్ (48) అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట మండలం నూనెవారిపల్లి గ్రామానికి చెందిన శివకుమార్ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేనడి నగర్లో ఉన్న తన బంధువు చింతల రమణమూర్తి ఇంటికి వచ్చారు. అనంతరం అదే ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
శివకుమార్ ఆత్మహత్యపై ఆయన భార్య కళ్యాణి తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. శివకుమార్ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని ఈస్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. జనసేన పార్టీ రాజంపేట నాయకుడి మృతి పట్ల పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
