ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల జీతాల పెరుగుదలకు రంగం సిద్ధమైంది. నెలకు ఎమ్మెల్యేలకు 2 లక్షల రూపాయల వేతనం అందేలా.. కొత్త విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకురానుంది. ప్రభుత్వం ఆమోదించడమే తరువాయి.. వెంటనే ఎమ్మెల్యేల జీతభత్యాలు అమాంతం పెరగనున్నాయి. బాబు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక.. బలమైన కారణం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
తనకు ఇష్టం లేకపోయినా.. ఎమ్మెల్యేలు చేసిన బలవంతంతోనే.. జీతాలు పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు.. తెలంగాణ ప్రభుత్వం శాసన సభ్యుల జీతాలు మూడున్నర లక్షల రూపాయలకు పెంచడం.. ఆ వెంటనే బాబు సర్కార్ కూడా అందుకు అనుగుణంగా డెసిషన్ తీసుకోవడంపై.. కొందరు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచీ.. తోటి తెలుగు రాష్ట్రంతో అన్ని విషయాల్లో పోటీకి వస్తున్న బాబు సర్కార్.. ఎమ్మెల్యేల జీతాల పెంపు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునేలా కొందరు ఎమ్మెల్యేలు కీ రోల్ పోషించారని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అసలే రాజధాని లేని పరిస్థితుల్లో… కేంద్రం సహకారం అందని సిచువేషన్ లో… లోటు బడ్జెట్ తో నెట్టుకొస్తున్న రాష్ట్రాన్ని.. మరింత ఇబ్బంది పెట్టేలా ఎమ్మెల్యేలు వ్యవహరించి ఉంటారని అనుమానిస్తున్నారు.
అందుకే.. విధి లేకున్నా.. తనకు ఇష్టం లేకున్నా.. ఎమ్మెల్యేల జీతాలు పెంచేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకుని ఉంటారని విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో జీతాలు పెంచేస్తున్నారు.. మనకు పెంచకుంటే.. పరువు ఉంటుందా? అన్నంత స్థాయిలో బాబును కొందరు భయపెట్టబట్టే.. అంతిమంగా ఎమ్మెల్యేల వేతనాల పెరుగుదుల జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంతో.. గాలి ముచ్చట ఎంతో.. అంతా బాబు గారికే ఎరుక!
