రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో కల్తీ పాల వ్యవహారం కలకలం రేపింది. రావిచెడు గ్రామంలోని ఓ పాల సేకరణ కేంద్రంలో నకిలీ పాలను తయారు చేస్తున్న శ్రీశైలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు దాడులు నిర్వహించిన అధికారులు, అక్కడ తయారు చేస్తున్న అనుమానాస్పద పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో మిల్క్ క్రీమ్, సాఫ్ట్ షుగర్ వంటి పదార్థాలను ఉపయోగించి పాలను కల్తీ చేస్తున్నట్టు బయటపడింది. ఈ నకిలీ పాలను నాచారం ప్రాంతంలోని పాల కేంద్రానికి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కల్తీ పాల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కల్తీ పాల సరఫరాలో మరెవరైనా భాగస్వాములు ఉన్నారా అనే దిశగా విచారణ సాగుతోంది. సంబంధిత ఆహార భద్రత శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
