బెంగళూరులో ఓ దంపతులు అనుకోకుండా తమ నిద్రలో ఉన్న 4 ఏళ్ల చిన్నారిని క్యాబ్‌లోనే మరిచిపోయిన ఘటన కలకలం రేపింది. ఫిబ్రవరి 14న ట్రిప్ ముగించుకుని ఇంటికి చేరుకున్న తర్వాత వారు క్యాబ్ నుంచి దిగిపోయారు. అయితే వెనుక సీటులో నిద్రలో ఉన్న తమ బిడ్డ కారులోనే ఉందని గమనించలేదు. క్యాబ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కొంతసేపటికి విషయం గుర్తించిన దంపతులు ఆందోళనకు గురై వెంటనే ‘112’ అత్యవసర హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఘటన వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించారు. కేవలం రెండు నిమిషాల్లోనే ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకుని వాహన నంబర్, లైవ్ లోకేషన్ ఆధారంగా క్యాబ్‌ను ట్రాక్ చేశారు. డ్రైవర్‌ను సంప్రదించి, చిన్నారితో కలిసి దంపతుల అపార్ట్‌మెంట్‌కు రావాలని సూచించారు.
డ్రైవర్ చిన్నారి సురక్షితంగా కారులోనే ఉన్నట్లు ధృవీకరించి, గంటలోపే వారి ఇంటికి చేరుకుని బిడ్డను అప్పగించాడు. అనంతరం పోలీసులు దంపతులతో కౌన్సెలింగ్ నిర్వహించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
