జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో రూ.1 కోటి లోన్ సెటిల్‌మెంట్ వివాదం కారణంగా ఒక లోన్ రికవరీ ఏజెంట్‌ను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడిని అమిత్ కుమార్ అగర్వాల్‌గా గుర్తించారు. ఆయన కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, అనంతరం ధన్‌బాద్ సదర్ ప్రాంతంలోని సూర్య హైల్యాండ్ సొసైటీలోని ఒక ఫ్లాట్‌లో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఆ ఫ్లాట్ వికాస్ ఖండేల్‌వాల్‌కు చెందినది. సాంకేతిక నిఘా, మొబైల్ ఫోన్ లొకేషన్ డేటా ఆధారంగా వికాస్ ఖండేల్‌వాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, హత్యకు పాల్పడినట్లు అతడు ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతోనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతదేహాన్ని ధన్‌బాద్‌లోని షహీద్ నిర్మల్ మహతో మెమోరియల్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ (లా అండ్ ఆర్డర్) నౌషాద్ ఆలమ్ మాట్లాడుతూ, ఈ హత్య వెనుక ఆర్థిక వివాదమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుడు, మృతుడి మధ్య సుమారు రూ.1 కోటి లోన్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి వివాదం కొనసాగుతోంది. అదే హత్యకు ప్రధాన కారణం అని తెలిపారు.
అమిత్ అగర్వాల్ కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆయన కనిపించకుండా పోయిన తర్వాత, అమిత్ మొబైల్ ఫోన్ నుంచే రూ.15 లక్షల విమోచన (రాన్సమ్) డిమాండ్ కాల్స్ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో మరెవరి పాత్ర ఉందా, రాన్సమ్ కోణం ఎంతవరకు నిజమో తెలుసుకునేందుకు లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
