నకిలీ బంగారం బిస్కెట్ల పేరుతో ఓ నగల వ్యాపారిని మోసం చేసిన ఘటన కలకలం రేపింది. ప్రముఖరాలి పీఏనని చెప్పుకుంటూ వ్యాపారిని నమ్మించిన శ్రీనాథ్ రాటి, తెలివిగా ప్లాన్ అమలు చేశాడు. మొదట బంగారు బిస్కెట్లు ఇచ్చి, వాటి విలువకు సమానంగా నగలు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు.
మొదటి మూడు సార్లు అసలైన బంగారం ఇచ్చి వ్యాపారిలో నమ్మకం కలిగించాడు. బంగారం నాణ్యతను పరీక్షించగా నిజమైనదిగా తేలడంతో వ్యాపారి ఎలాంటి అనుమానం లేకుండా లావాదేవీలు కొనసాగించాడు. ఈ నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని నాల్గోసారి నకిలీ బంగారం బిస్కెట్లు ఇచ్చి భారీగా నగలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
కొద్ది రోజుల తర్వాత బంగారం నాణ్యతపై అనుమానం రావడంతో పరీక్షించగా అది నకిలీగా తేలింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి మోసాల నుంచి రక్షణకు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
