ఏపీ నుంచి ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీపై కూటమి పార్టీల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో సీట్ల పంపకంపై ఆసక్తికర సమీకరణాలు కనిపిస్తున్నాయి. టీడీపీ కోటా నుంచి మంత్రి నారా లోకేష్ సన్నిహితులైన కిలారి రాజేష్ పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే సానా సతీష్‌కు రెన్యూవల్ అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనసేన కోటాలో లింగమనేని రమేష్ పేరు ప్రస్తావనకు వస్తోంది. ఆయన చంద్రబాబు కరకట్ట నివాస యజమానిగా గుర్తింపు పొందారు. బీజేపీ కోటాలో మరో కీలక వ్యక్తి ఎంపిక అవుతారని సమాచారం.
అయితే ఈ ఎంపికలపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దగా రాజకీయ అనుభవం లేని వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ–జనసేన కోటా సీట్లు ఆర్థికంగా బలమైన నేతలకే కేటాయించే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.
ఇక టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ఈసారి కూడా నిరాశే మిగిలే అవకాశముందని పార్టీ అంతర్గత చర్చల్లో వినిపిస్తోంది. గతంలోనూ ఆశలు పెట్టుకున్న ఆయనకు అవకాశం దక్కలేదని గుర్తుచేస్తున్నారు. మొత్తంగా రాజ్యసభ సీట్ల ఎంపికపై కూటమిలో తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
