ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా సాగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండగా మండలిలో మాత్రం టీడీపీ వైఖరిని ఎండగడుతున్నారు.
ఈ క్రమంలో సొంతపార్టీ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యంగా వచ్చి, అసెంబ్లీ సమావేశాలు పూర్తికాక ముందే వెళ్తున్న ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కీలక చర్చల సమయంలో సభ్యుల గైర్హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సమావేశం ప్రారంభమయ్యే సమయానికి శాసనసభలో 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో అసెంబ్లీలో విప్‌లను అప్రమత్తం చేశారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.
సీఎం ఆరా తీయడంతో.. సమావేశానికి డుమ్మా కొట్టిన 17 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి అప్పటికప్పుడు పిలిపించారు విప్‌లు. పూర్తి స్థాయిలో సభ్యులు హాజరయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
