యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు గుప్పించాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా. వైభవ్ కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్‌కు అద్భుత ఆరంభాన్ని అందించాడు. ప్రపంచ స్థాయి బౌలర్లు బుమ్రా, బౌల్ట్ లను ధైర్యంగా ఎదుర్కొని తన ప్రతిభను చాటుకున్నాడు. బుమ్రా వేసిన మొదటి బంతినే సిక్స్ కొట్టడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది.
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన సూర్యవంశీ, జైస్వాల్‌తో కలిసి కేవలం 5 ఓవర్లలో 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తం 11 ఓవర్ల మ్యాచ్‌లో రాజస్థాన్ 150 పరుగులు చేసి, చివరకు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జైస్వాల్‌కు దక్కినా, అసలైన ప్రశంసలు మాత్రం సూర్యవంశీకే దక్కాయి. హార్దిక్ పాండ్య మాట్లాడుతూ…ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యంగా ఆడటం చూడటం నిజంగా అద్భుతం. అతని బ్యాటింగ్, ఫియర్లెస్ అటిట్యూడ్ చాలా గొప్పగా ఉంది. అతని భవిష్యత్తుకు శుభాకాంక్షలు అన్నారు.
మ్యాచ్ ఫలితంపై స్పందించిన పాండ్య…తమ జట్టు బౌలింగ్ వైఫల్యాన్ని కారణంగా పేర్కొన్నారు.మేము వేయాల్సిన బంతులను సరిగా అమలు చేయలేకపోయాం. బౌలర్లు బాధ్యత తీసుకోవాలి. బ్యాటింగ్ కాదు, ఈ ఓటమికి బౌలింగ్ యూనిట్ కారణం అన్నారు. ముంబై తన నెక్ట్స్ మ్యాచ్‌ను ఏప్రిల్ 12న వాంఖడే స్టేడియంలో ఆర్సీబీతో ఆడనుంది.
