ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన జగన్..నంద్యాల జిల్లా సీతారామాపురంలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల కళ్లెదుటే సుబ్బారాయుడి హత్య జరగడం బాధాకరం అన్నారు.
వైసీపీ నేతలే టార్గెట్‌గా గూండాలు హత్యలకు పాల్పడుతున్నారు అని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి… లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందన్నారు. హత్యలు చేసినవారికే కాదు, చేయించినవారినీ కఠినంగా శిక్షించాలని దుయ్యబట్టారు. దాడులకు, హత్యలకు మద్దతు ఇస్తున్న వారినీ ముద్దాయిలుగా చేరిస్తే తప్ప రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదు అన్నారు.
ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తాం, అవసరం అయితే సుప్రీం కోర్టుకు కూడా వెళ్తాం అని తేల్చిచెప్పారు జగన్. మా కార్యకర్తలందరినీ రక్షించుకుంటాం… పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను… వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చాను అన్నారు జగన్.
ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని…. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదు అన్నారు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయని దుయ్యబట్టారు.ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తాం అన్నారు.
