అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికే ఎకరానికి సుమారు రూ.2 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు మాజీ సీఎం జగన్. ఈ లెక్కలు కూడా ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే వెల్లడించినవేనని అన్నారు. ఈ లెక్కన లక్ష ఎకరాల అభివృద్ధికి దాదాపు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని, అంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఎక్కడి నుంచి సమకూర్చుకుంటుందో స్పష్టం చేయాలని ప్రశ్నించారు.
2019కు ముందు రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ఇప్పుడు ఎందుకు మార్చుతున్నారని జగన్ ప్రశ్నించారు. దీని వెనుక ఏదైనా ప్రత్యేక ప్రయోజనం ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని, ఆయన పని దోపిడీ చేయడమేనని ఆరోపించారు.
అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ప్రత్యేక బిల్లు అవసరం లేదని జగన్ పేర్కొన్నారు. ఈ పేరుతో ప్రభుత్వం “డ్రామా” చేస్తోందని విమర్శించారు.
రాజ్యాంగంలో రాష్ట్రాలకు “రాజధాని” అనే పదం స్పష్టంగా లేదని జగన్ వ్యాఖ్యానించారు. దేశానికి రాజ్యాంగం ఉన్నప్పటికీ, రాష్ట్రాలు తమ రాజధానిని తాము నిర్ణయించుకునే స్వేచ్ఛ కలిగి ఉంటాయని తెలిపారు.
జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు తమ రాజధానులను స్వయంగా నిర్ణయించుకున్నాయని ఉదాహరణగా చెప్పారు.జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. అమరావతి అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది.
