వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలతో నేరుగా మమేకం కావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఈ నేపథ్యంలో కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో పులివెందులకు చేరుకోనున్న వైఎస్ జగన్, అక్కడి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే కార్యక్రమం జరగనుంది. అలాగే స్థానిక నాయకులతో కూడా పరిస్థితులపై సమీక్ష చేయనున్నారు.
రేపు ఉదయం 10 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు బయలుదేరనున్న మాజీ సీఎం, అక్కడ మధ్యాహ్నం 1 గంట వరకు సెమీ క్రిస్మస్ ప్రార్థన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ప్రార్థనలో పాల్గొని శాంతి, సౌభ్రాతృత్వ సందేశాన్ని ప్రజలకు అందించనున్నారు. అనంతరం తిరిగి పులివెందులకు చేరుకుని పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. పార్టీ సంస్థాగత అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించనున్నట్లు సమాచారం.
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీ ఉదయం 8 గంటలకు పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అనంతరం కూడా ఆయన కొంత సమయం ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతంపై జగన్ ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.
