పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. నెలరోజుల పాటు కొనసాగిన ఈ సమావేశంలో అధికార, విపక్ష కూటముల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య వాడివేడిగా సాగాయి. ప్రధానంగా బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక పునఃసమీక్ష (SIR) పై ఆందోళనలు, ఆపరేషన్ సిందూర్ చర్చలతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ సమావేశంలోని ప్రధాన అంశాలను ఓసారి పరిశీలిస్తే..
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన పదవీకాలం ముగియకముందే, అనారోగ్య కారణాల్ని చూపిస్తూ రాజీనామా చేయడం పార్లమెంట్‌ను కుదిపేసింది. ఆయన నిర్ణయం వెనుక ఇతర కారణాలున్నాయా అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ల మధ్య ఆపరేషన్ సిందూర్ పై తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. మోదీ కాంగ్రెస్‌పై “సైన్యం కంటే పాకిస్తాన్‌నే నమ్మింది” అని ఆరోపించగా, రాహుల్ “ప్రధాని ఇమేజ్ కాపాడడానికే ఈ ఆపరేషన్ నడిపారు” అని తీవ్ర విమర్శలు చేశారు.
బీహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక పునఃసమీక్ష (SIR)పై INDIA కూటమి నిరసనలు కొనసాగించింది. ఓటు దొంగతనం ఆపండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించి సభా కార్యకలాపాలు అడ్డుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మంత్రులు 30 రోజులకు పైగా నిర్బంధంలో ఉంటే తప్పనిసరిగా రాజీనామా చేయాలన్న బిల్లును ప్రవేశపెట్టారు. విడుదలైన తర్వాత తిరిగి పదవి చేపట్టే అవకాశం కల్పించిన ఈ బిల్లుపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పించింది.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు కేసుపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సీనియర్ న్యాయవాది పి.వి. ఆచార్య, సుప్రీంకోర్టు జడ్జి అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ ఉన్నారు. స్వాతంత్ర్యం తరువాత తొలిసారిగా దక్షిణ భారత రాష్ట్రాల నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. NDA తరఫున తమిళనాడుకు చెందిన సి.పి. రాధాకృష్ణన్, INDIA కూటమి తరఫున తెలంగాణకు చెందిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగారు.
పార్లమెంట్ ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు–2025ను ఆమోదించింది. దీని ప్రకారం ఆన్‌లైన్ గేమ్స్ నిషేధం, వాటి ప్రకటనలకు నిషేధం, బ్యాంకులు ఈ లావాదేవీలను ప్రాసెస్ చేయకుండా ఆంక్షలు విధించబడ్డాయి. జూలై 21 తర్వాత ఇరుసభల్లో చట్టపరమైన కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయి. లోక్‌సభలో 12 బిల్లులు, రాజ్యసభలో 14 బిల్లులు మాత్రమే ఆమోదించబడ్డాయి.
స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. “సూచనాబద్ధమైన అంతరాయాలు, నినాదాలతో” సభా కార్యకలాపాలను అడ్డుకున్నారని విమర్శించారు. మొత్తం 120 గంటలు జరగాల్సిన లోక్‌సభ కేవలం 37 గంటలు మాత్రమే పనిచేసిందని వివరించారు. నెలరోజులపాటు సాగిన సమావేశం చివరికి భారత ప్రభుత్వం తన చట్టపరమైన విజయాలను ప్రస్తావిస్తే, ప్రతిపక్షం ఎన్నికల సంఘం ప్రవర్తన, ఆపరేషన్ సిందూర్‌పై తీవ్రమైన వైఫల్యాలను బయటపెట్టామని పేర్కొంది.
