పిఠాపురం రాజకీయాల్లో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఫ్లెక్సీ వివాదంతో మొదలైన చిన్నపాటి వాగ్వాదం.. మాజీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట వరకు వెళ్లింది.
పాడ (PADA) కార్యాలయంలో జరిగిన ‘పీఎం అజయ్’ (PM-AJAY) కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్మ అధికారులను ప్రశ్నిస్తున్న సమయంలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో జనసేన నేత పెండెం దొరబాబు ఒక్కసారిగా వర్మపైకి దూసుకెళ్లారు. నేతల మధ్య గొడవ ముదరడంతో టీడీపీ-జనసేన కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకున్నారు. ఈ తోపులాటతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా స్పందించారు. మేం పిఠాపురంలో పుట్టి పెరిగాం.. ఎక్కడి నుంచో దత్తతకు రాలేదు. పిఠాపురంలో టీడీపీ బలంగా ఉంది కాబట్టే పవన్‌కు 80 వేల మెజార్టీ వచ్చింది. నియోజకవర్గంలో పరిస్థితులు మరీ టూమచ్‌గా ఉన్నాయి. రేపటి నుంచి మా బలం ఏంటో చూపిస్తాం అని హెచ్చరించారు.
కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి ప్రోటోకాల్ వివాదాలు మరియు పాత కక్షలు నేతల మధ్య చిచ్చు పెడుతున్నాయి.
