వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. మాధవ్ ఇటీవల నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో మైనర్ బాలికల పేర్లు వెల్లడించారని ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. మైనర్ల గుర్తింపును బహిర్గతం చేయడం చట్టపరంగా నేరం కావడంతో, పోలీసుల విచారణ మరింత కీలకంగా మారింది.
ఈ కేసు సంబంధించి గతంలో వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టగా, ఆ సందర్భంలో గోరంట్ల మాధవ్ ఒకసారి విచారణకు హాజరై తన వివరణ ఇచ్చారు. అయితే, కేసులో కొన్ని అంశాలు ఇంకా క్లారిటీ కావాల్సిన అవసరం ఉందని భావించిన పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని గోరంట్ల మాధవ్ ముందుగానే స్పష్టం చేశారు. అయితే, పోలీసులు చట్టపరమైన ప్రక్రియలో భాగంగా పూర్తి స్థాయి విచారణ జరపాలని నిర్ణయించారు. ఈ విచారణలో మాధవ్ ఏ వివరణ ఇస్తారన్నది, కేసు ఏ దిశగా సాగుతుందన్నది రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారింది.
