టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ జట్టును అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తప్పించింది. భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లకు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసినప్పటికీ, ఐసీసీ దీనిని పూర్తిగా తిరస్కరించింది.
స్వతంత్ర భద్రతా సంస్థల నివేదికల ప్రకారం భారత్‌లోని వేదికల్లో ఎలాంటి భద్రతా ముప్పు లేదని ఐసీసీ స్పష్టం చేసింది. టోర్నీకి సమీపంలో షెడ్యూల్ మార్పు సాధ్యం కాదని కూడా తేల్చిచెప్పింది. అయినప్పటికీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ వైఖరిని మార్చుకోకపోవడంతో, ఐసీసీ తుది చర్యలకు దిగింది.
జనవరి 21న బీసీబీకి ఐసీసీ అల్టిమేటమ్ ఇచ్చినా స్పందన రాకపోవడంతో, బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మెంబర్స్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్‌పై సంతకం చేసిన తర్వాత కూడా టోర్నీ నుంచి తప్పుకోవడం తీవ్ర నిబంధనల ఉల్లంఘనగా ఐసీసీ భావిస్తోంది.
బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం ఇవ్వనున్నారు. టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత పొందని జట్లలో స్కాట్లాండ్ అత్యున్నత ర్యాంక్‌లో ఉండటంతో, వారే సహజమైన ప్రత్యామ్నాయంగా మారారు.
