ఇతర మతాలకు మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను అనుసరించే వారికే షెడ్యూల్డ్ కాస్ట్ (SC) హోదా వర్తిస్తుందని స్పష్టం చేసింది.
జస్టిస్ పీకే మిశ్రా, ఎన్వీ అంజారియాల బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందని ఇతర మతాల్లోకి మారితే, ఎస్సీ హోదా కోల్పోతారని తేల్చిచెప్పింది.
అదేవిధంగా, మత మార్పిడి చేసిన వ్యక్తులు SC/ST (Prevention of Atrocities) Act కింద రక్షణ పొందలేరని కోర్టు స్పష్టం చేసింది.ఈ కేసు పాస్టర్ ఆనంద్ దాఖలు చేసిన అప్పీల్ నేపథ్యంలో విచారణకు వచ్చింది. ఆయన తన గ్రామంలో ప్రార్థనలు నిర్వహిస్తూ ఉండగా, కొంతమంది వ్యక్తులు తనపై దాడులు చేసి, కుల దూషణలు చేశారని ఆరోపించారు. దీనిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
అయితే, నిందితులు ఆయన క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా పనిచేస్తున్నందున, ఎస్సీ హోదాకు అర్హుడు కాదని వాదించారు. ఏపీ హైకోర్టు ఇప్పటికే ఆయన క్రైస్తవ మతంలోకి మారిన కారణంగా ఎస్సీ హోదా కోల్పోయారని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.
ఆనంద్ తిరిగి తన మూల మతంలోకి మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.దశాబ్దకాలంగా పాస్టర్‌గా సేవలు అందిస్తున్నాడు.సంఘటన జరిగిన రోజున కూడా ప్రార్థనలు నిర్వహిస్తున్నాడు. ఈ అంశాల ఆధారంగా ఆయన క్రైస్తవ మతాన్నే అనుసరిస్తున్నట్లు స్పష్టమైందని కోర్టు తెలిపింది.
హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందని వ్యక్తులు ఎస్సీ వర్గానికి చెందరు. ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా కోల్పోతారు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
