మరోసారి వివాదంలోకి నిలిచారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. మహిళా డాక్టర్ భర్త షరీఫ్‌ను ఫోన్‌లో బండబూతులు తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి రావడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే… ఆస్రా కంటి ఆసుపత్రి యాజమానులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము కొనుగోలు చేసిన కోటి రూపాయల విలువైన భవనాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని, ఈ అక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌తో పాటు ఆయన బంధువులే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ భర్త షరీఫ్ ఎమ్మెల్యేపై విమర్శలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో షరీఫ్‌కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, “నాపైనే విమర్శలు చేస్తావా?” అంటూ అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ దంపతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి భాష ఉపయోగించడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఆడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ, ప్రస్తుతం అది సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. దీనిపై అన్ని వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. టీడీపీ నాయకత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బాధితులు న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.
