వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన సతీమణి భారతితో కలిసి హాజరయ్యారు. సంప్రదాయ పంచెకట్టు, భుజాన కండువాతో జగన్మోహన్ రెడ్డి వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వేడుకలు సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. అనంతరం వేదపండితులు పంచాంగ శ్రవణం నిర్వహించి, ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను వివరించారు. పంచాంగ శ్రవణం అనంతరం జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సాహభరిత వాతావరణంలో ఉగాది పండుగను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా జగన్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అందరికీ శాంతి, సుఖసంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
