ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అమెరికా తన ప్రధాన లక్ష్యాలకు చాలా దగ్గరగా చేరుకుందని, త్వరలో సైనిక చర్యలను తగ్గించే అవకాశం ఉందని ఆయన సూచించారు. ఇటీవల చేసిన ప్రకటనలో యుద్ధం తుదిదశకు చేరుకునే అవకాశముందని తెలిపారు.
అమెరికా బలగాలు సాధించిన ముఖ్య విజయాల గురించి ట్రంప్ వివరించారు.ఇరాన్ క్షిపణి శక్తి బలహీనపడిందని, రక్షణ వ్యవస్థలకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.ఇకపై ఇరాన్ అణ్వస్త్రాలు అభివృద్ధి చేయకుండా చర్యలు తీసుకున్నామని కూడా తెలిపారు. ఈ చర్యల వల్ల ప్రాంతీయ భద్రతకు ఉన్న ముప్పు తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ యుద్ధంలో ప్రధాన లక్ష్యం మధ్యప్రాచ్యంలోని మిత్రదేశాల భద్రత అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్,సౌదీ అరేబియా,ఖతర్,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,బహ్రెయిన్
కువైట్.ఈ దేశాలకు అమెరికా బలమైన భద్రతా మద్దతు అందించిందని తెలిపారు.
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి భద్రతపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ మార్గాన్ని వినియోగించే దేశాలే దాని భద్రత బాధ్యతను తీసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైతే అమెరికా సహాయం అందిస్తుందని చెప్పినప్పటికీ, ఇకపై అక్కడ భద్రతా చర్యలకు అమెరికా నాయకత్వం వహించదని స్పష్టం చేశారు.
హార్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన మార్గం కావడంతో, అక్కడ ఎలాంటి అంతరాయం వచ్చినా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
