కోటి సంతకాలు సాధించిన ఈ ఉద్యమం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టమని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్రకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలతో నిరసన తెలపడం ప్రజా చైతన్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువత, విద్యార్థులు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం గమనార్హమని పేర్కొన్నారు. కోటి దాటిన సంతకాల ప్రతులను త్వరలో గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి అందజేసి, ప్రజల నుంచి వెల్లువెత్తిన నిరసనను ఆయన దృష్టికి తీసుకెళ్తామని జగన్ గారు తెలిపారు.
ఇదే సమయంలో, ప్రజల్లో ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతోందని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంపై జగన్ గారు తీవ్ర విమర్శలు గుప్పించారు. కలెక్టర్ల పనితీరుతో కాదు, మీ పనితీరు బాగాలేకనే ప్రజల్లో మీ గ్రాఫ్ పడిపోతోంది. చంద్రబాబుకే ఇది అర్థం కావడం లేదు అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచి ఏమిటో చెప్పగలరా అని ప్రశ్నించారు.
ఉదయం పత్రికల్లో చంద్రబాబు వ్యాఖ్యలు చూసి ఆశ్చర్యపోయానని జగన్ అన్నారు. తమ పాలనలో ప్రతి నెల ప్రజలకు ఏ పథకం అందించబోతున్నామో ముందుగానే క్యాలెండర్ విడుదల చేసి, పారదర్శకంగా అమలు చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా చంద్రబాబు గ్రాఫ్ లేవడం లేదని, ప్రజల అసంతృప్తే దీనికి ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను విస్మరించి, కీలక రంగాలను ప్రైవేటీకరణ వైపు నెట్టే ప్రయత్నాలకు ప్రజలు తగిన సమాధానం ఇస్తున్నారని జగన్ గారు వ్యాఖ్యానించారు.
